బుల్లెట్ రైలు సాధన పోరాటంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలి
పాత మార్గంలోనే బుల్లెట్ రైలు మార్గాన్ని కొనసాగించాలని ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్
సూర్యాపేట, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బుల్లెట్ రైలు మార్గం అలైన్‌మెంట్‌లో చేసిన మార్పులతో జాతీయ రహదారి 65 ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని ఐక్య విద్యార్థి సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. సూర్యాపేటలోని సీపీఐ కార్యాలయంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, జనసేవా సమితి అధ్యక్షులు తగుళ్ల జనార్దన్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, డీఎస్‌ఓ జిల్లా కార్యదర్శి భాషపంగు సునీల్, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పోలోజు మహేష్ మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం మొదట ప్రకటించిన జాతీయ రహదారి 65కు సమాంతరంగా బాటసింగారం, చౌటుప్పల్, నార్కెట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, మునగాల, కోదాడ, జగ్గయ్యపేట, నందిగామ మీదుగా అమరావతి రూట్‌ను ప్రకటించిందన్నారు. దీన్ని కాదని ప్రస్తుత అలైన్‌మెంట్‌ను మార్చడం వెనుక కొందరి స్వార్థం, లాభాపేక్ష దాగి ఉన్నాయని నాయకులు ఆరోపించారు.
ఆంధ్ర ప్రాంత పెత్తందార్ల ఒత్తిళ్లు, కొంతమంది పాలకుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ రూట్ మ్యాప్‌ను శంషాబాద్ నుంచి హాలియా మీదుగా అమరావతికి మార్చారని ఆరోపించారు. ప్రజా అవసరాలను, ఆకాంక్షలను పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ లాబీలకు, వారి భూముల విలువలు పెంచడానికి ఈ నిర్ణయం జరిగిందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం శంషాబాద్ నుంచి మాల్, మర్రిగూడ, నాంపల్లి, హాలియా మీదుగా మార్గాన్ని మార్చడం వల్ల హైవే 65 ప్రాంత నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు, వ్యాపార రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధికి కానీ ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
కేవలం తమ భూముల గుండా ఆంధ్రకు రైలు దారి ఇవ్వడం తప్ప తెలంగాణకు ఒరిగేదేమీ లేదని విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. బుల్లెట్ రైలును పాత మార్గంలోనే సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్తామని, ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని ఆందోళనలను ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
