షైన్ హై స్కూల్‌లో ఘనంగా బోనాల వేడుకలు

భూపాలపల్లి టౌన్, ఆంధ్రప్రభ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను భూపాలపల్లిలోని షైన్ హై స్కూల్ 2.0 క్యాంపస్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా పాల్గొనగా, పోతురాజు వేషధారణలు, జానపద నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ భాను చందర్ మాట్లాడుతూ బోనాల పండుగ చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలు, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.