ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన
నడిగూడెం, ఆంధ్రప్రభ : క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు, కార్మిక, కూలీల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత కిసాన్ సభ, సీఐటీయూ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేరకు ఆగస్టు 10న కోదాడలో నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ పిలుపునిచ్చారు.
నడిగూడెం మండల కేంద్రంలో సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విదేశీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల దేశంలోని వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి రైతులు దివాలా తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని, రుణ విమోచన చట్టం చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును, నూతన విత్తన చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
లేబర్ కోడ్ను రద్దు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి బడ్జెట్ తగ్గించే కుట్రలను తిప్పికొట్టాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 10న కోదాడలో నిర్వహించనున్న జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి మండల కమిటీ సభ్యులు ఎస్కే లతీఫ్ బాబు అధ్యక్షత వహించగా, మండల కమిటీ సభ్యులు బీరవెల్లి సుధాకర్ రెడ్డి, ఎస్కే మస్తాన్, కేశగాని భద్రయ్య, సంపత్, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
