ఎమ్మెల్యే జయసూర్య సంచలన నిర్ణయం

  • పట్టణ రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్‌కు శ్రీకారం
  • నందికొట్కూరు చరిత్రలోనే అభివృద్ధి నిధులకు భారీ ప్యాకేజీ
  • 18 నెలలు దశలవారీగా పనుల పూర్తికి డెడ్‌లైన్

నందికొట్కూరు, ఆంధ్రప్రభ: నందికొట్కూరు పట్టణ చరిత్రలోనే అతిపెద్ద అభివృద్ధి ప్రణాళికకు ఎమ్మెల్యే గిత్త జయసూర్య శ్రీకారం చుట్టారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుని రూ.200 కోట్లతో భారీ మాస్టర్ ప్లాన్‌ను ఆయన స్వయంగా రూపొందించినట్లు బుధవారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌..

గత 50 ఏళ్లుగా నందికొట్కూరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన రోడ్లు డ్రైనేజీ, తాగునీటి కొరతకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ ప్రణాళిక ఉందని ఎమ్మెల్యే తెలిపారు. గత మూడు నెలలుగా ప్రతి వార్డులో స్వయంగా పర్యటించి, ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, వారి కష్టాలు తెలుసుకుని, మున్సిపల్, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించి ఈ మాస్టర్ ప్లాన్‌ను తయారు చేశానని వివరించారు.

ప్రధాన రహదారుల నాలుగు లేన్ల విస్తరణ అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, 100% భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, 24 గంటల ఫిల్టర్ తాగునీటి సరఫరా, ప్రతి వీధిలో ఎల్ఈడి దీపాలు, అన్ని వార్డుల్లో ఆధునిక పార్కులు, జిమ్‌లు, స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ఆధునిక బస్ స్టాండ్, మార్కెట్ ఆధునీకరణ, వంటి పనులను దశలవారీగా 18 నెలల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

రుణం తీర్చుకుంటా..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ.. నందికొట్కూరు నా ఊపిరి. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకునే సమయం వచ్చింది. ఈ పట్టణాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 మోడల్ టౌన్‌గా చేసే బాధ్యత నాది. నా ప్రత్యేక చొరవతో రూపొందించిన ఈ రూ.200 కోట్ల ప్రణాళికతో పట్టణ రూపురేఖలు పూర్తిగా మార్చి చూపిస్తా. ఇది నా మాట ఇది నా హామీ. పనుల్లో ఎక్కడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పూర్తి చేస్తాం అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ సహకారంతో నిధులు మంజూరు చేయించుకుని వచ్చే నెల నుంచే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి వార్డు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తామని ప్రజల భాగస్వామ్యంతో పనులు చేపడతామని హామీ ఇచ్చారు.