రాష్ట్ర ప్రగతే ప్రభుత్వ ప్రధాన అజెండా: మంత్రి అనిత

చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల స్థాపన, యువతకు ఉద్యోగావకాశాల కల్పన, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, అమరావతి రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయడం, సూపర్ సిక్స్ హామీల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించిందన్నారు.

రాష్ట్ర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, మహిళలకు భద్రత, రైతులకు అండ, యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆమె పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు, ఆరోపణల కంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

వారిపై చట్టప్రకారమే చర్యలు తీసుకుంటాం..

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి నిరసన వ్యక్తం చేసే హక్కు ఉందని అంగీకరించిన అనిత, ఆ హక్కు పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే, వారిపై చట్టప్రకారమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆమె తెలిపారు. ఈగిల్ (EAGLE) వ్యవస్థ ద్వారా గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యువత చేతిలో మాదకద్రవ్యాలు కాకుండా ఉద్యోగాలు, నైపుణ్యాలు ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. యువతను సరైన మార్గంలో నడిపించేందుకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.

రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన..

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగబద్ధ పాలన కొనసాగుతోందని మంత్రి అనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎలాంటి వ్యక్తిగత లేదా రాజకీయ విధానాలకు కాకుండా, భారత రాజ్యాంగానికి అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగమే రాష్ట్ర పాలనకు మార్గదర్శకమని పేర్కొన్నారు. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని, ఎవరికీ ప్రత్యేక మినహాయింపులు ఉండవని చెప్పారు.

రాజకీయ అలజడులు సృష్టించడం తమ ప్రభుత్వ లక్ష్యం కాదని, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, మహిళల భద్రత, యువత భవిష్యత్తు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపైనే ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిందని మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు.