మెగా డీఎస్సీపై బహిరంగ చర్చకు సిద్ధం

  • రద్దీ సెంటర్లలో వైసీపీ ధర్నాలు చేయటం సరికాదు
  • చంద్రబాబు, లోకేష్ పై నోరు జారితే చూస్తూ ఊరుకోం..
  • టీడీపీ ఉపాధ్యక్షుడు, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా

విజయవాడ సెంట్రల్, ఆంధ్రప్రభ: మెగా డీఎస్సీపై ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధమని, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని టీడీపీ ఉపాధ్యక్షుడు, సెంట్రల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ముత్యాలంపాడు ప్రాంతంలో ప్రజలను ఇబ్బందులు గురిచేస్తూ వైసీపీ ధర్నాలు చేయడం పట్ల ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు టీడీపీ శ్రేణులతో కలసి ధర్నా జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. దీంతో టీడీపీ శ్రేణులు అక్కడ ఉన్న టెంట్లు తొలగించారు. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

వైసీపీ, టీడీపీల మధ్య ఘర్షణ వాతావరణం తారా స్థాయికి చేరుకొంది. రద్దీగుండే సెంటర్లలో,బస్టాప్ను ఆక్రమించడం, వైసీపీ ధర్నాలు చేయటం సరికాదు, రాజకీయ పార్టీలు ధర్నాలు చేసుకునేందుకు ధర్నా చౌక్ ఉంది. అలాగే మా నాయకులు నారా చంద్రబాబు,లోకేష్ పై నోరు జారితే చూస్తూ ఊరుకోమని టీడీపీ ఉపాధ్యక్షుడు,సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా హెచ్చరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ఈ అంశంపై ఎప్పుడైనా ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీడీపీ ఉపాధ్యక్షుడు బొండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు.

విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు “ఇంటింటికీ టీడీపీ” కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేక ఎనిమిది నెలల క్రితం పూర్తయిన మెగా డీఎస్సీ అంశాన్ని ఇప్పుడు రాజకీయంగా రాద్ధాంతం చేస్తున్నారని బొండా ఉమా ఆరోపించారు. 18 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీని ప్రభుత్వం పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించిందని స్పష్టం చేశారు.