హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలి

అక్రమ ఆక్రమణల తొలగింపుతో చెరువులు పరిరక్షణ సాధ్యం: జి. హనుమాన్ గౌడ్

సంగారెడ్డి, ఆంధ్రప్రభ ప్రతినిధి : హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించడంలో హైడ్రా సమర్థవంతంగా పనిచేస్తోందని, ఇదే విధానాన్ని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని కాలుష్య నివారణ జేఏసీ చైర్మన్ జి. హనుమాన్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.

గురువారం ఆయన మాట్లాడుతూ గతంలో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో అనేక కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండేవని తెలిపారు. వచ్చిన తీర్పుల్లో కూడా చాలా వరకు అమలు కాలేదని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైడ్రా చేపడుతున్న చర్యల వల్ల చెరువులు ఆక్రమణల నుంచి విముక్తి పొందుతున్నాయని, ఈ చర్యలను తాము స్వాగతిస్తున్నామని అన్నారు.

చెరువులతో పాటు వర్షపు నీరు వెళ్లే నాలాలు, కాలువలపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూడా తొలగించాలని సూచించారు. దీంతో వర్షాకాలంలో నగరంలోని రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు.

హైడ్రాకు చట్టబద్ధత లేదని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోని వెట్‌ల్యాండ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్‌మెంట్ రూల్స్–2010లోని సెక్షన్–5, సబ్‌సెక్షన్–5 ప్రకారం హైడ్రా వంటి చర్యలకు ప్రత్యేకంగా అసెంబ్లీలో చట్టం లేదా గవర్నర్ ఆర్డినెన్స్ అవసరం లేదని పేర్కొన్నారు.

30 నుంచి 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్ల తొలగింపుతో నిరాశ్రయులవుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలని సూచించారు. దీంతో వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

హైడ్రా చర్యలకు రాష్ట్ర ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొంటూ, ఇదే తరహా చర్యలను తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జి. హనుమాన్ గౌడ్ కోరారు.