నీటి కష్టాలకు చెక్..

జెడ్పీహెచ్‌ఎస్‌లో చేతి పంపు ఏర్పాటు

విద్యార్థుల సమస్యకు స్పందించిన వీరమల్ల సురేష్ గౌడ్

మునుగోడు, ఆంధ్రప్రభ : మునుగోడు మండలం కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది.

సాగర్ నీటి సరఫరా నిలిచిపోవడంతో పాటు విద్యుత్ సమస్య కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన కొంపల్లి గ్రామ యువజన నాయకుడు, ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్ ఎండీ వీరమల్ల సురేష్ గౌడ్ స్పందించారు.

తన సేవా దృక్పథంతో సుమారు రూ.40 వేల వ్యయంతో పాఠశాల ఆవరణలో బోరు వేయించి, చేతి పంపును ఏర్పాటు చేయించారు.

దీంతో పాఠశాలలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, ప్రజలు వీరమల్ల సురేష్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థుల సంక్షేమం కోసం ఆయన అందించిన సహకారం ఆదర్శప్రాయమని కొనియాడారు. ఇతర దాతలు కూడా విద్యా సంస్థల అభివృద్ధికి ముందుకు రావాలని కోరారు.