జయశంకర్ ఆశయాలు విద్యార్థులకు స్ఫూర్తి
జగ్గయ్యపేట జడ్‌పీహెచ్‌ఎస్‌లో ఘనంగా 93వ జయంతి వేడుకలు
రేగొండ (గోరికొత్తపల్లి), ఆంధ్రప్రభ : తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 93వ జయంతి వేడుకలను జగ్గయ్యపేట జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఒంటేరు చంద్రశేఖర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, విద్యారంగానికి విశిష్ట సేవలు అందించిన మహనీయుడిగా చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, అంకితభావంతో విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు జయశంకర్ జీవిత విశేషాలు, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన త్యాగాలు, విద్యాభివృద్ధికి అందించిన సేవలను విద్యార్థులకు వివరించారు. ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొంది దేశ, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళులర్పించారు.
