తాటి వనాన్ని దగ్ధం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి

తాటి వనాన్ని దగ్ధం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి
- గౌడ సంఘం నేతల డిమాండ్
చెన్నారావుపేట, ఆంధ్రప్రభ: గౌడ కులస్తులకు జీవనాధారమైన తాటి చెట్లను కావాలనే దగ్ధం చేసిన కడగండ్ల పెద్ద యాకయ్య అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లింగగిరి గౌడ సంఘం అధ్యక్షుడు పులి రమేష్, అమీనాబాద్ గౌడ సంఘం అధ్యక్షుడు అంబాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లింగగిరి గ్రామంలో ఉన్న తాటి వనాన్ని సదరు వ్యక్తి తగులబెట్టడంతో సుమారు 20 తాటి చెట్లు పూర్తిగా కాలిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదం కారణంగా వాటి మీద ఆధారపడి బతుకుతున్న గౌడ కులస్థులు తమ జీవనోపాధిని కోల్పోయారని వారు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే స్థానిక పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విద్యాశాఖ, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు బూర్గు శ్రీనివాస్, చిన్న వెంకన్న, వెంకటనర్సు, కుమారస్వామి, నవీన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
మరో ఘటనలో పాత ముగ్దంపురం గ్రామ శివారులోని లో-లెవల్ బ్రిడ్జి వంతెన వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అంటించిన నిప్పు కారణంగా అక్కడి చెట్లు ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని గమనించిన స్థానిక సర్పంచ్ ననుమాస కరుణాకర్ వెంటనే స్పందించారు. గ్రామ పంచాయతీ (జీపీ) వాటర్ ట్యాంకర్ సహాయంతో నీళ్లు చల్లించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే కొన్ని తాటి చెట్లు కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు.
