మెగా డీఎస్సీ నియామకాల్లో కూటమి సర్కార్ మెగా స్కామ్
- నారా లోకేశ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
- వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
నర్సాపురం, ఆంధ్రప్రభ: మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో కూటమి ప్రభుత్వం మెగా స్కాంకు పాల్పడిందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో నియోజక వర్గం నలుమూలల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ ఆందోళన కార్య క్రమంలో భాగంగా స్థానిక అంబేద్కర్ సెంటర్ లో గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరాన్ని పీఏసీ సభ్యులు పీడీ రాజు ప్రారంభించారు. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించి, అనంతరం దీక్షా శిబిరంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటానికి పూల దండలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పీడీ రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నియామకాలలో భారీ అక్రమాలు జరిగాయని, నిరుద్యోగుల జీవితాలతో కూటమి నేతలు చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కి రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సీనియర్ నాయకులు షాన్ వాజ్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రశ్నాపత్రాల లీకేజీలు, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు.
పప్పుల రామారావు, పెండ్ర వీరన్నలు మాట్లాడుతూ.. విద్యార్థులకు అందాల్సిన సుమారు రూ.7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు (విద్యా దీవెన, వసతి దీవెన) వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీఈఆర్‌టీకి చెందిన కొందరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రశ్నాపత్రాల రూపకల్పన, అప్‌లోడింగ్ బాధ్యతలు అప్పగించడం వల్లే పేపర్ లీక్ జరిగిందని ఆరోపించారు.
సోషల్ మీడియాలో జిల్లా కో ఆర్డినేటర్ బంధన పూర్ణ మాట్లాడుతూ.. అర్హతలు (బి.ఎడ్., టెట్) లేని వారికి, గుర్తింపు లేని క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. ఎంపికైన అభ్యర్థుల పూర్తి మెరిట్ జాబితాలను కలెక్టరేట్ కార్యాలయాల్లో లేదా అధికారిక వెబ్‌సైట్లలో వెల్లడించకుండా, కేవలం ఎంపికైన వారికి మాత్రమే ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన మొత్తం వ్యవహారంపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
నిరాహారదీక్ష చేపట్టిన వారిలో మొగల్తూరు మండలం నాయకులు, నర్సాపురం , మొగల్తూరు జడ్పీటీసీలు బొక్కా రాధాకృష్ణ, తిరుమాని బాపూజీ, నాయకులు రేవు నారాయణ రాజు, పాలా రాంబాబు, పడవల సత్య నారాయణ, కూరెళ్ళ ముక్తేశ్వరరావు, రేవు రాంబాబు, సాధనాల నాగరాజు, వేగి రాజశేఖర్, లక్కు నారాయణ రావు ఉన్నారు. వీరికి వైసీపీ నాయకులు, పలు ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపి మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు పీడీ రాజు, పప్పుల రామారావు, పెండ్ర వీరన్న, బర్రె శ్రీ వెంకట రమణ జయరాజు, బంధన పూర్ణ, కొల్లబత్తుల రవి కుమార్, షాన్ వాజ్ ఖాన్ , మైలబత్తుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
