విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ.. తప్పిన పెను ప్రమాదం

వికారాబాద్, ఆంధ్రప్రభ: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వికారాబాద్–పరిగి ప్రధాన రహదారిపై గురువారం ఓ భారీ లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం ఒకవైపు ప్రమాదకరంగా ఒరిగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం మరింత తీవ్రరూపం దాల్చకుండా లారీ అక్కడే నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అప్రమత్తంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం మరమ్మతు పనులు చేపట్టడంతో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఘటన కారణంగా వికారాబాద్–పరిగి రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.