యూపీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

యూపీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
మేడ్చల్, ఆంధ్రప్రభ: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి సోమవారం రోజు మేడ్చల్ పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) నీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి ప్రతిరోజూ వస్తున్న రోగుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా మెడిసిన్ స్టోరేజ్ ఏరియాను తనిఖీ చేసి, అక్కడ ఉన్న మందుల నిల్వలను పరిశీలించారు. ట్యాబ్లెట్ల గడువు ముగిసే తేదీలను స్వయంగా తనిఖీ చేసిన కలెక్టర్, నాణ్యమైన మందులను మాత్రమే రోగులకు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.
ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి వారికి కావాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకోగా, రోగులకు సిబ్బందికి ఉపయోగపడే విధంగా అదనపు వాష్‌రూమ్ (Washroom) సౌకర్యం కల్పించాలని వారు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. త్వరలోనే వాష్‌రూమ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట డిప్యూటీ తహసీల్దార్ అనూష, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
