సార్ ఆశయాలు ఆదర్శనీయం
ఐటీడీఏ పీవో మంద మకరందు
ఉట్నూర్ ఐటీడీఏలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అధికారులు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు భావితరాలకు ఆదర్శప్రాయమని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు. గురువారం ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంద మకరందు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఐటీడీఏ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆయన చేసిన పరిశోధనలు, ఉద్యమం, త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు.
సమాజ అభివృద్ధికి విద్య, సామాజిక చైతన్యం, ప్రజా సంక్షేమం ఎంతో అవసరమని జయశంకర్ బోధించిన విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, విద్యా విస్తరణ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారానే ఆయన ఆశయాలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని అన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీతనంతో సేవలందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిబద్ధతతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ (జనరల్) వసంత్‌రావు జాదవ్, పీవీటీజీ ఏపీఓ ఆత్రం భాస్కర్, డీడీ ప్రేమకళ, జీసీసీ డీఎం గుడిమల్ల సందీప్‌కుమార్, ఈఈ తానాజీ జాదవ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
