Indrakeeladri | భక్తులతో కళకళలాడుతున్న ఇంద్రకీలాద్రి…
- ఆషాఢ సారె ఉత్సవాలకు మహిళల భక్తుల రాక..
- ఒక్కరోజే 45,573 మంది అమ్మవారి దర్శనం..
- 44 సారె బృందాల నుంచి 18,904 మంది సారె సమర్పణ
- పోలీసు శాఖ, ఎజైల్ సెక్యూరిటీ సిబ్బంది భక్తిశ్రద్ధలతో ప్రత్యేక సారె
- వేద పరిరక్షణ, అన్నదానానికి రూ.3 లక్షలకు పైగా విరాళాలు..
- భక్తులకు విస్తృత సౌకర్యాలు
Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆషాఢ సారె మహోత్సవాలు రోజురోజుకూ భక్తి వైభవాన్ని చాటుతున్నాయి. అమ్మవారిని ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించే మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారెలతో భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లిస్తుండటంతో ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. బుధవారం ఉత్సవాల 22వ రోజున ఆలయానికి భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఒక్కరోజే 45,573 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 44 సారె బృందాల ద్వారా 18,904 మంది సారె సమర్పించారు. సారె బృందాలకు దేవస్థానం ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ప్రసాదాలు ఏర్పాటు చేసింది.

బుధవారం వివరాలు ఇలా…
ఆలయ గణాంకాల ప్రకారం బుధవారం 5,422 దర్శన టికెట్లు విక్రయించగా, 52,264 ప్రసాదాలు పంపిణీ చేశారు. హుండీ, విరాళాల రూపంలో రూ.5,46,638 ఆదాయం సమకూరింది. 269 మంది వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనగా, 1,037 మంది కేశఖండన నిర్వహించారు. నిత్య అన్నదానంలో 8,844 మంది భక్తులు ప్రసాద భోజనం స్వీకరించారు.

ఆషాడ సారె సమర్పించిన సిపి…
ఆషాఢ సారె ఉత్సవాల్లో భాగంగా విజయవాడ నగర పోలీసు శాఖ తరఫున పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు దంపతులు, ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది కుటుంబ సమేతంగా సంప్రదాయ ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. వేదపండితుల ఆశీర్వచనాల అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.

ఏజెన్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఆషాడ సారె…
అదే విధంగా ఎజైల్ టెండర్ సెక్యూరిటీ సంస్థ సిబ్బంది కూడా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. జమ్మిదొడ్డి అమ్మవారి వద్ద సంప్రదాయ పూజలతో కార్యక్రమాన్ని ప్రారంభించి సారె సమర్పించారు. ఆలయ భద్రత, భక్తులకు సేవలందించడంలో సెక్యూరిటీ సిబ్బంది సేవలు ప్రశంసనీయమని దేవస్థాన అధికారులు అభినందించారు.

అమ్మవారికి విరాళాలు…
దేవస్థానానికి భక్తుల విరాళాలు కూడా కొనసాగుతున్నాయి. వేద పరిరక్షణ ట్రస్టుకు హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన జి.బి. శాస్త్రి–ప్రశాంతి దంపతులు లక్ష్మీనాగ అపరాజిత పేరుతో రూ.1 లక్ష విరాళం అందజేశారు. నిత్య అన్నదాన పథకానికి విజయవాడ విద్యాధరపురానికి చెందిన పి. యుగంధర్ దంపతులు రూ.1,01,116, మొగల్రాజపురానికి చెందిన సాయి సుమ–హేమచంద్ర దంపతులు రూ.1 లక్ష విరాళం సమర్పించారు. దాతలకు దేవస్థానం ప్రత్యేక దర్శనం కల్పించి వేదాశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేసింది.

ప్రత్యేక ఏర్పాట్లు…
ఆషాఢ సారె మహోత్సవాల సందర్భంగా రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ, అన్నదానం, భద్రత తదితర ఏర్పాట్లను దేవస్థానం మరింత విస్తృతంగా నిర్వహిస్తోంది. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. భక్తి, సేవ, దాతృత్వం కలగలిసిన ఆషాఢ సారె ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేస్తున్నాయి.
