తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం

బిడ్డ పుట్టిన అరగంటలోపే తల్లిపాలు అందించాలి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో తల్లిపాల బ్యాంకుల ఏర్పాటుకు చర్యలు

నాగర్‌కర్నూల్ (ఆంధ్రప్రభ): తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరమని, బిడ్డ పుట్టిన తొలి అరగంటలోపే తల్లిపాలు అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితానికి బలమైన పునాది పడుతుందని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మంద పుల్లారెడ్డి ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి కేసరి సముద్రం మినీ ట్యాంక్‌బండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.

ర్యాలీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తొలి మూడు రోజుల్లో వచ్చే ముర్రుపాలు (కొలస్ట్రం) శిశువుకు ప్రకృతి ప్రసాదించిన తొలి టీకా వంటివని, తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. తల్లులు ఎక్కడైనా బిడ్డకు పాలిచ్చే పరిస్థితి వచ్చినప్పుడు సమాజం దానిని గౌరవప్రదంగా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో తల్లిపాల బ్యాంకుల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వరకు తల్లిపాల ప్రాధాన్యాన్ని విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బందిపై ఉందని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు.