ఆధ్యాత్మిక పర్యటక టూరిజం
- ఏపీటీడీసీ ఆధ్యాత్మిక యాత్ర..
- వడపల్లి–ద్వారకా తిరుమల వరకు
- ఆగస్టు 8 నుంచి విజయవాడ నుంచి ప్రత్యేక టూర్ ప్రారంభం
- ఉదయం 4 గంటలకు తొలి బస్సు ప్రారంభం
- భక్తులకు అల్పాహారం, భోజనం సదుపాయం
- ఒకేరోజులో రెండు ప్రముఖ వైష్ణవ క్షేత్రాల దర్శనం
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మరో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తోంది. విజయవాడ కేంద్రంగా వడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాల దర్శనానికి ప్రత్యేక పర్యాటక యాత్రను ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభించనుంది. తొలి యాత్ర ఉదయం 4 గంటలకు విజయవాడ సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం (సీఆర్వో) నుంచి బయలుదేరనుండగా, ఏపీటీడీసీ ఛైర్మన్ నూక సాని బాలాజీ స్వయంగా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని జనరల్ మేనేజర్ (రవాణా) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
చైర్మన్ సమీక్షతో..
ఆగస్టు 3న ఏపీటీడీసీ ఛైర్మన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ టూర్ ప్యాకేజీని ఆగస్టు 8 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. సమావేశంలో ఛైర్మన్ ఇచ్చిన ఆదేశాల మేరకు తొలి యాత్ర విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను జనరల్ మేనేజర్ (రవాణా) ఆదేశించారు.
లాంఛనంగా ప్రారంభించనున్న చైర్మన్..
తొలి యాత్ర ప్రారంభ సందర్భంగా ఛైర్మన్ నూకసాని బాలాజీ చేతుల మీదుగా జెండా ఊపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, టూర్ నిర్వహణకు అవసరమైన అడ్వాన్స్ నిధులను సిద్ధం చేయాలని, ప్రయాణికుల కోసం ప్యాక్డ్ అల్పాహారం ఏర్పాటు చేయాలని, అలాగే టూర్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేందుకు అవసరమైన అన్ని లాజిస్టిక్, కార్యాచరణ ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.
ఈ ప్రత్యేక ప్యాకేజీ కింద ఉదయం 4 గంటలకు విజయవాడ సీఆర్వో నుంచి బస్సు బయలుదేరుతుంది. ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రావులపాలెం మీదుగా ఉదయం 7 గంటలకు వడపల్లికి చేరుకుంటుంది. అక్కడ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు స్థానిక దేవాలయాలను భక్తులు దర్శించుకుంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు ద్వారకా తిరుమలకు బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు అక్కడి హరిత హోటల్‌కు చేరుకుంటారు. భోజనం అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో దర్శనం నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణమై రాత్రి 7 గంటలకు సీఆర్వోకు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. సుమారు 380 కిలోమీటర్ల దూరం సాగే ఈ యాత్రకు 36 సీట్ల నాన్ ఏసీ హైటెక్ బస్సును ఏర్పాటు చేశారు.
పెద్దలకు రూ.1,160, పిల్లలకు రూ.1,000గా ప్యాకేజీ ధర నిర్ణయించారు. ప్యాకేజీలో ప్యాక్డ్ అల్పాహారం, మధ్యాహ్న భోజనం మాత్రమే ఉంటాయి. ఆలయ దర్శన టికెట్లు, ఇతర వ్యక్తిగత ఖర్చులను యాత్రికులే భరించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఏపీటీడీసీ అధికారులు తెలిపారు.
