విద్యార్థులతో రాహుల్ భేటీ..

  • విద్యా సంస్కరణలపై కీలక వ్యాఖ్యలు
  • ప్రశ్నాపత్రాల లీకేజీలు అరికట్టాలి..
  • యువత భవిష్యత్‌కు భరోసా కల్పించాలి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో విద్యార్థులతో సమావేశమై విద్యా వ్యవస్థ, ప్రశ్నాపత్రాల లీకేజీలు, యువత భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడలేదని, అయినప్పటికీ వారిని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ అన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి విద్యార్థుల్లోనే ఉందని, వారి గొంతును అణిచివేయడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.

దేశంలో విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు అవసరమని ఆయన పేర్కొన్నారు. యువత భవిష్యత్తును రక్షించే విధంగా విద్యా విధానం ఉండాలని, విద్యార్థుల్లో నమ్మకం పెంచే చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు దేశ యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.