బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రైల్వే గేటు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. అక్కడ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తడకన సాగుతున్నాయని, దీంతో వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయకుండా పనులు పూర్తి చేయకపోవడంతో గేటు వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయాలని, అప్పటి వరకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సర్వీస్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రాస్తారోకో విరమింపజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శిలారపు పర్వతాలు, తంగెడ రాజేశ్వర్ రావు, మేకల శ్రీనివాస్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

