సామాజిక సేవలో ఎల్బీఆర్ ఇంజినీరింగ్ విద్యార్థులు..
41 మందికి సేవా పురస్కారాలు
మైలవరం, ఆంధ్రప్రభ: సమాజ సేవలో విశేష కృషి చేసిన లకిరెడ్డి బాలిరెడ్డి (ఎల్బీఆర్) ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు సేవా ధ్రువీకరణ పత్రాలు, సేవా పురస్కారాలను అందజేశారు. మైలవరం ఓల్డ్ స్టూడెంట్స్ ట్రస్ట్ (మోస్ట్) ఆధ్వర్యంలో, నార్త్ సౌత్ ఫౌండేషన్ ఉపకార వేతనాలు పొందుతున్న విద్యార్థులకు ఈ సర్టిఫికెట్లను బుధవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు.
జూలై 23 నుంచి ఆగస్టు 1 వరకు పది రోజులపాటు 50 గంటల పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న 41 మంది విద్యార్థులకు కళాశాల అధ్యక్షుడు జి. శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ డా. కె. అప్పారావు, మోస్ట్ వైస్ చైర్మన్ ఎం.డి. అమీర్ హంజా, కార్యదర్శి జూలకంటి ప్రసాద్ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షుడు జి. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సేవా దృక్పథాన్ని అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని సూచించారు. ప్రిన్సిపాల్ డా. కె. అప్పారావు మాట్లాడుతూ నార్త్ సౌత్ ఫౌండేషన్ ఉపకార వేతనాల పునరుద్ధరణలో భాగంగా విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా సమన్వయకర్త గూడూరు నాగిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. మోస్ట్ సహకారంతో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి విద్యార్థులు ఉపకార వేతనాల పునరుద్ధరణకు అర్హత సాధించేలా కృషి చేసిన నాగిరెడ్డి సేవలను అభినందించారు.
విద్యార్థులు మొక్కల నాటకం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, ఆహార పదార్థాల పంపిణీ, కాలానుగుణ వ్యాధులపై అవగాహన, ప్రైవేట్ పాఠశాలల్లో రోడ్డు భద్రత, మంచి స్పర్శ–చెడు స్పర్శ, సైబర్ నేరాలు, విద్యలో లక్ష్య నిర్దేశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అనాథలు, నిరుపేదలు, వృద్ధులకు దుప్పట్లు, భోజన ప్యాకెట్లు, మంచినీటి బాటిళ్లు పంపిణీ చేయడంతో పాటు అయ్యప్పస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమంలో సేవలందించారు.
ఈ సేవా కార్యక్రమాలన్నీ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించినట్లు సమన్వయకర్త గూడూరు నాగిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. బి. రమేష్‌రెడ్డి, మోస్ట్ సభ్యుడు సురేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. శివహరి ప్రసాద్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎస్. ఉమామహేశ్వరరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
