క్రిస్టియన్‌పేటలో ఇంటింటికి తెలుగుదేశం..

ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే తాతయ్య

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ: పట్టణంలోని 61, 62వ బూత్‌ల పరిధిలోని క్రిస్టియన్‌పేటలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు మేక వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ కర్ల శాంతకుమారి, జోజి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఎమ్మెల్యే కలిశారు.

ఈ సందర్భంగా ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ప్రతి కుటుంబానికి అందుతున్న ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అలాగే సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిస్తున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు.

ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు మేక వెంకటేశ్వర్లు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.