బయోడైజెస్టర్ ప్రారంభం – తడి చెత్తకు శాశ్వత పరిష్కారం…

బయోడైజెస్టర్ ప్రారంభం – తడి చెత్తకు శాశ్వత పరిష్కారం…

24 గంటల్లోనే చెత్త నుండి ఎరువు తయారీ…
రోజుకు 1000 కేజీల తడి చెత్త ప్రాసెసింగ్ సామర్థ్యం…
వ్యవసాయం, హార్టికల్చర్‌కు నాణ్యమైన ఎరువు..
జిల్లా కలెక్టర్ రాజకుమారి

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా లో తడి చెత్త నిర్వహణను శాస్త్రీయంగా, సమర్థవంతంగా చేపట్టేందుకు ఆధునిక బయోడైజెస్టర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. శనివారం పొన్నాపురం కాలనీలో నిర్వహించిన “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా 17 లక్షలతో నిర్మించిన బయోడైజెస్టర్ యంత్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ బయోడైజెస్టర్ సౌకర్యం ద్వారా రోజుకు సుమారు 1000 కిలోల తడి చెత్తను వినియోగించి, కేవలం 24 గంటల వ్యవధిలోనే అధిక నాణ్యత గల ఎరువుగా మారుస్తుందని తెలిపారు. ఈ ఎరువును వ్యవసాయ భూముల్లో, పండ్ల తోటలలో, అలాగే గృహ స్థాయిలో పెంచుకునే మొక్కలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

తయారైన ఎరువును మరింత మెరుగైన నాణ్యతతో పొందేందుకు సుమారు 30 రోజులపాటు ప్రత్యేక గుంతల్లో నిల్వ ఉంచితే, అది మెత్తటి పొడి రూపంలోకి మారుతుందన్నారు. పట్టణంలోని చిన్న, పెద్ద హోటళ్ల యజమానులు తమ వద్ద ఉత్పత్తి అయ్యే తడి చెత్తను ఈ బయోడైజెస్టర్ ద్వారా కంపోస్ట్‌గా మార్చుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా హోటల్ యాజమాన్యాలకు అవగాహన కల్పించేందుకు త్వరలో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా, పట్టణంలోని హాస్టల్స్ నుండి ఉత్పత్తి అయ్యే తడి చెత్తను కూడా ఈ కేంద్రానికి తరలించి ఎరువుగా మార్చుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ ఆధునిక సౌకర్యాన్ని మున్సిపల్ అధికారులు సమర్థంగా వినియోగించుకుని, పట్టణంలో తడి చెత్త నిర్వహణను మెరుగుపరచాలని కలెక్టర్ ఆదేశించారు.

పట్టణాన్ని శుభ్రంగా, పర్యావరణహితంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. మొత్తంగా, బయోడైజెస్టర్ సౌకర్యం ద్వారా తడి చెత్తను విలువైన వనరుగా మార్చుకుంటూ, నంద్యాలను స్వచ్ఛమైన, సుస్థిర పట్టణంగా తీర్చిదిద్దే దిశగా ఇది ఒక కీలకమైన అడుగుగా నిలుస్తుందన్నారు. పట్టణ స్వచ్ఛతను మరింత బలోపేతం చేయడంలో ఇది కీలకమైన ముందడుగు అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply