దేశంలోనే మూడవ స్థానంలో కెడీసీసీ బ్యాంక్……
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : దేశంలోనే కెడీసీసీ బ్యాంక్ మూడవ స్థానంలో ఉందని బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు. సోమవారం మండల కేంద్రం పెనుగంచిప్రోలులో డ్వాక్రా మహిళలు, రైతులకు కర్షకమిత్ర, రైతునేస్తం రుణాలను మండలంలోని 9 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా లబ్దిదారులకు రూ. 6.78 కోట్ల రుణాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కెడీసీసీ బ్యాంక్ ప్రస్తుతం రూ. 12,595 కోట్ల వ్యాపారం చేస్తోందని, డిపాజిట్లు రూ. 4 వేలు కోట్లు ఉన్నాయన్నారు. సంఘాల ద్వారా అన్ని రకాల రుణాలు అందిస్తామన్నారు.
సహకార వ్యవస్థ అంటే మనకు మనమే సహకారం అందుకోవటం అన్నారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ ద్వాక్రా మహిళలు. రైతులు తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్ధికంగా ఎదగాలన్నారు. బంగారం కొనకుండా ఉన్న డబ్బులను ఉపయోగించుకుని ఆదాయం పొందాలన్నారు. పెనుగంచిప్రోలులో బస్టాండ్, కరకట్ట నిర్మాణానికి అందరం కలిసి కృషి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో బ్యాంక్ జీఎం రంగబాబు, డీజీఎం కె శ్రీనివాసరావు, స్థానిక బ్రాంచి చీఫ్ మేనేజర్ ఏ దుర్గాప్రసాద్, బీఎం లీలావతి, సంఘ అధ్యక్షులు కర్ల వెంకటనారాయణ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాకాని శ్రీనివాసరావు, గజ్జి కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ వేగినేటి గోపాలకృష్ణమూర్తి, మండల సమాఖ్య అధ్యకురాలు కర్ల కోటేశ్వరి, మండలంలోని సహకార సంఘాల అధ్యకులు, తదితరులు పాల్గొన్నారు.
