పెద్ది స్వప్నను పరామర్శించిన అనిల్ కూర్మాచలం

పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని నివాళి

నర్సంపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని మాజీ టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్, ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ సెల్–యూకే వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు.

బుధవారం నల్లబెల్లి మండలంలోని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామంలోని వారి నివాసానికి వెళ్లిన అనిల్ కూర్మాచలం, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్నను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం కుటుంబానికే కాకుండా తెలంగాణ ఉద్యమానికి, నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని పేర్కొంటూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన త్యాగాలు, ప్రజాసేవ, నిరంతర ప్రజా పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచిన ఆయన సేవలను నర్సంపేట ప్రజలు ఎప్పటికీ మరువరని పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఈ క్లిష్ట సమయంలో పార్టీ శ్రేణులు, అభిమానులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రముఖులు పాల్గొని స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.