పెట్టుబడి మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. సీపీ హెచ్చరిక

సైబర్ నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అంబర్ కిషోర్ ఝా పిలుపు

గోదావరిఖని, ఆంధ్రప్రభ: సైబర్ నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పెట్టుబడి పేరుతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు.

‘సురక్షా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని ఇల్లందు క్లబ్‌లో సింగరేణి హెచ్‌డీ అధికారులకు సైబర్ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా సైబర్ అవగాహన పోస్టర్లను విడుదల చేసి, సైబర్ భద్రత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సైబర్ భద్రత, డిజిటల్ సెక్యూరిటీ, ఆన్‌లైన్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు.

రాష్ట్రవ్యాప్తంగా సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈసారి ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రస్తుతం నమోదవుతున్న సైబర్ నేరాల్లో దాదాపు 30 శాతం పెట్టుబడి మోసాలేనని పేర్కొన్నారు.

ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఆర్థికంగా స్థిరపడిన వారినే సైబర్ నేరగాళ్లు ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజల వ్యక్తిగత వివరాలు, ఆన్‌లైన్ అలవాట్లు, సోషల్ మీడియా వినియోగాన్ని విశ్లేషించి ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు.

అధిక లాభాల హామీలు, తెలియని లింకులు, అనుమానాస్పద యాప్‌లు, పెట్టుబడి ఆహ్వానాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని చెబితే అది సైబర్ మోసానికి ప్రధాన హెచ్చరికగా భావించాలని అన్నారు.

సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వచ్చినా, డబ్బు నష్టం జరిగినా లేదా జరగకపోయినా వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. వెంటనే ఫిర్యాదు చేస్తే సంబంధిత బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లపై చర్యలు తీసుకుని నేరగాళ్లను గుర్తించే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

సైబర్ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టకుండా వెంటనే పోలీసులకు తెలియజేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని సీపీ పేర్కొన్నారు.