తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ..
అవగాహన కార్యక్రమాలు
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సీడీపీఓ సుశీల సూచనలు
సంగారెడ్డి, ఆంధ్రప్రభ: చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలే అమృతమని, పుట్టిన గంటలోనే శిశువుకు తల్లిపాలను ప్రారంభించి తొలి ఆరు నెలల పాటు పూర్తిగా తల్లిపాలనే అందించాలని జహీరాబాద్ సీడీపీఓ సుశీల సూచించారు.
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బుధవారం జహీరాబాద్, కోహిర్ మండల కేంద్రాల్లో మండల స్థాయి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు సీడీపీఓ సుశీలతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్, మెడికల్ ఆఫీసర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్య సంరక్షణలో తల్లిపాల పాత్ర, పుట్టిన గంటలోనే తల్లిపాలను ప్రారంభించడం, తొలి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలే ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు.
అనంతరం కావేలి అంగన్‌వాడీ కేంద్రంలో కేంద్ర స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరై తల్లిపాల వల్ల తల్లి, శిశువులకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్లు అనిత కుమారి, నీరజా గ్రేస్, జైనబ్ బక్షి, పుష్ప గర్భిణులు, బాలింతలు, వారి కుటుంబ సభ్యులకు తల్లిపాల ప్రాముఖ్యత, సమతుల్య పోషకాహారం, శిశు సంరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆరోగ్య శాఖ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
