ప్రతి ఆరోగ్య సేవ నాణ్యతతో అందించాలి..
- టీకా కార్యక్రమం, కోల్డ్‌చైన్, ప్రయోగశాల, ఫార్మసీ సేవలపై సమీక్ష
- రోగులకు సకాలంలో పరీక్షల ఫలితాలు, చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం
విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు నాణ్యంగా, సకాలంలో అందేలా ప్రతి ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. శ్రావణ్ బాబు సూచించారు. బుధవారం ఆయన విజయవాడలోని క్రీస్తురాజపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బంది ముఖ ఆధారిత హాజరు నమోదుతో పాటు విధి నిర్వహణను పరిశీలించిన ఆయన, ప్రభుత్వ నిబంధనల మేరకు సమయపాలనతో సేవలు అందించాలని ఆదేశించారు.
అనంతరం వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అమలు, వ్యాక్సిన్ల నిల్వ విధానం, కోల్డ్‌చైన్ వ్యవస్థను తనిఖీ చేసి అవసరమైన సూచనలు చేశారు. ఆరోగ్య కేంద్రంలోని ప్రయోగశాలను పరిశీలించిన డీఎంహెచ్‌వో, రక్త పరీక్షల నివేదికలను రోగులకు సకాలంలో అందజేసి వెంటనే చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని ల్యాబ్ టెక్నీషియన్‌ను ఆదేశించారు. ఫార్మసీలో మందుల నిల్వలను పరిశీలించి, అవసరమైన ఔషధాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

అలాగే టీకాల అనంతరం అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉపయోగించే ఏఈఎఫ్‌ఐ కిట్‌లోని మందుల లభ్యతను కూడా పరిశీలించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన గర్భిణులు, బాలింతలకు వ్యాధి నిరోధక టీకాల ప్రాముఖ్యత, మాతా-శిశు ఆరోగ్య (ఎంసీహెచ్) కార్డులో ప్రతి టీకా వివరాలను నమోదు చేయించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన ఆన్‌లైన్ నమోదును శాతం శాతం పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డాక్టర్ ఏ. శ్రావణ్ బాబు ఆదేశించారు.
