మై భారత్ కార్యక్రమాలను యువతకు చేరువ చేయాలి..
- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం యువత కోసం అమలు చేస్తున్న మై భారత్ కార్యక్రమాలపై గ్రామ స్థాయి నుంచి కళాశాలల వరకు విస్తృతంగా అవగాహన కల్పించి ప్రతి యువతకు చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలంటే వారికి నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛంద సేవా అవకాశాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.

బుధవారం చిత్తూరులోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి మై భారత్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో 2026–27 సంవత్సరానికి సంబంధించిన మై భారత్ వార్షిక కార్యాచరణ ప్రణాళికపై సమగ్రంగా చర్చించారు. యువజన సాధికారత, నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ శిక్షణలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల అమలుపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్, మై భారత్ ప్రోగ్రామ్ సూపర్వైజర్ జి. శ్రీనివాసులు, జిల్లా అడ్వైజరీ కమిటీ సభ్యుడు హరీష్ కల్వకుంట, వివిధ శాఖల అధికారులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొని కార్యక్రమాల అమలుపై తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. మై భారత్ సిబ్బంది, వాలంటీర్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
