Stock Market | లాభాల్లో ముగిసిన సూచీలు..

  • 24,600 పైన నిఫ్టీ..
  • 152 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం ఒడిదుడుకుల మధ్య చివరికి లాభాలతో ముగిసింది. కొత్తగా అమల్లోకి వచ్చిన క్లోజింగ్ సెషన్ ఆక్షన్ (Closing Session Auction – CAS) విధానం కారణంగా ట్రేడింగ్ చివరి గంటలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ, కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లో నిలిచాయి. సెన్సెక్స్ 152 పాయింట్లు పెరిగి 78,581 వద్ద ముగియగా, నిఫ్టీ-50 10 పాయింట్లు లాభపడి 24,625 వద్ద స్థిరపడింది. మార్కెట్‌లో అస్థిరతను సూచించే ఇండియా వీఐఎక్స్ (India VIX) 1.5 శాతం తగ్గి 12 వద్దకు చేరింది.

ఇవే టాప్ గెయినర్లు..

అల్ట్రాటెక్ సిమెంట్ 2 శాతానికి పైగా పెరిగి సెన్సెక్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్‌టిపిసి, ఎస్‌బిఐ, మహీంద్రా & మహీంద్రా షేరులు దాదాపు 2 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇండిగో, కోటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, ఎల్&టి షేర్లు కూడా ఒక శాతానికి పైగా పెరిగాయి.

నష్టాల్లో ఐటీ షేర్లు

మరోవైపు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఒక్కో శాతానికి పైగా పడిపోయి ప్రధాన నష్టాల్లో నిలిచాయి. అలాగే టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ షేర్లు కూడా స్వల్ప నష్టాలను నమోదు చేశాయి.

రూపాయి బలపడింది

విదేశీ మారక మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి 0.3 శాతం బలపడి 95.1175 వద్ద ముగిసింది. అంతకుముందు ముగింపు విలువ 95.3775గా నమోదైంది.

ప్రపంచ మార్కెట్లలో సానుకూల ధోరణి..

అమెరికా ఫ్యూచర్స్, ఆసియా మార్కెట్లు కూడా బలంగా ట్రేడ్ అయ్యాయి. MSCI ఆసియా పసిఫిక్ సూచీ 2.2 శాతం, జపాన్ TOPIX 2 శాతం, షాంఘై కాంపోజిట్ 1.6 శాతం, ఆస్ట్రేలియా S&P/ASX 200 సూచీ 0.9 శాతం మేర పెరిగాయి. ఈ సానుకూల సంకేతాలు భారత మార్కెట్‌కు కూడా మద్దతుగా నిలిచాయి.

క్లోజింగ్ సెషన్ వేలంపై గందరగోళం

కొత్తగా అమలు చేసిన క్లోజింగ్ సెషన్ వేలం విధానం కారణంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈల మధ్య ముగింపు ధరలలో వ్యత్యాసాలు కనిపించాయి. ఈ రెండు ఎక్స్ఛేంజీలలోని ఆర్డర్ బుక్‌లు వేర్వేరుగా ఉండటమే ఈ తేడాలకు కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ట్రేడర్లు, సంస్థాగత పెట్టుబడిదారులు ఈ కొత్త వ్యవస్థకు అలవాటు పడిన కొద్దీ, కాలక్రమేణా ఈ వ్యత్యాసాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.