గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కోరిన నాయకులు

రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం

నడిగూడెం, ఆంధ్రప్రభ: కల్లు గీత కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లును సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో బీసీ హక్కుల సాధన సమితి కోదాడ నియోజకవర్గ అధ్యక్షురాలు మండవ నాగమణి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మండవ నాగమణి మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుడి భార్యకు పెన్షన్ మంజూరు చేయాలని, 50 సంవత్సరాలు పూర్తయిన గీత కార్మికులకు నెలకు రూ.4,000 పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు.

గ్రామ, మండల కేంద్రాల్లో తాటి, ఈత వనాల పెంపకానికి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో నీరా సెంటర్లను ఏర్పాటు చేసి గీత కార్మికులకు జీవన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

గీత కార్మికులు చైతన్యవంతులై ఐక్యంగా ముందుకు సాగాలని, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో తమ పాత్రను మరింత బలోపేతం చేసుకోవాలని, సామాజిక బాధ్యతలను గుర్తించి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.