మాజీ మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ ప్రయోజనాలే ప్రధానం
ఏపీ ప్రతిపాదనలపై హరీశ్ ధ్వజం
రేవంత్ వైఖరేంటో చెప్పాలి
తెలంగాణ నీటిపై రాజీ లేదు: హరీశ్

హైదరాబాద్ (ఆంధ్రప్రభ): తెలంగాణ నీటి హక్కులు, సాగునీటి ప్రాజెక్టుల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గోదావరి నదిపై తెలంగాణ చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించడం, అదే అంశాలు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశ అజెండాలో చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన నీటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశంపై వెంటనే తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

హరీశ్‌రావు మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేంద్ర సంస్థల నుంచి అనుమతులు పొందిన కాళేశ్వరం, సీతారామం, సమ్మక్క సాగర్ సహా మొత్తం ఏడు ప్రాజెక్టులపై ఇప్పుడు సమీక్ష చేపట్టే పరిస్థితి రావడం ఆందోళనకరమని అన్నారు. జీఆర్ఎంబీ సమావేశ అజెండాలో ఈ అంశాలను చేర్చడం వెనుక ఉన్న కారణాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరించాలని కోరారు. అజెండా వెలువడి వారం రోజులు గడిచినా తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు.

కేంద్రాన్ని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ నీటి ప్రయోజనాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఒకవైపు తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించడం లేదని చెబుతూ, మరోవైపు వాటి అనుమతులను రద్దు చేయాలని కేంద్రానికి లేఖలు రాయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు కేటాయించిన 47 టీఎంసీల నీటిపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయాలని ప్రశ్నించారు.

గత మూడు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టుకూ అనుమతి తీసుకురాలేదని హరీశ్‌రావు విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సమ్మక్క సాగర్ వంటి కీలక ప్రాజెక్టుల పురోగతి నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఇప్పటికే అనుమతులు పొందిన ప్రాజెక్టులకే ఇప్పుడు ముప్పు ఏర్పడుతోందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు, తెలంగాణకు చెందిన ఎంపీలు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు.

తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేసిన హరీశ్‌రావు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే జీఆర్ఎంబీ అజెండాపై అభ్యంతరం వ్యక్తం చేసి తెలంగాణ వైఖరిని బలంగా వినిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల నీటి హక్కులను దెబ్బతీసే ఏ నిర్ణయాన్నైనా బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు.