crime | నేపాలీ గ్యాంగ్ కోసం 10 ప్రత్యేక బృందాల గాలింపు
crime | నేపాలీ గ్యాంగ్ కోసం 10 ప్రత్యేక బృందాల గాలింపు
crime |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసు హైదరాబాద్‌లో సంచలనం రేపుతోంది. జూబ్లీహిల్స్‌లో జరిగిన ఈ దారుణ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. హత్య అనంతరం బంగారం, నగదుతో పరారైన పని మనిషి కల్పనతో పాటు ఆమె గ్యాంగ్‌ను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితుల కోసం ఇప్పటికే నేపాల్‌తో పాటు ముంబై, లక్నో, ఢిల్లీ ప్రాంతాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. పని మనిషి కల్పన గత చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లక్నోలో ఆమె గతంలో పనిచేసిన ఇంటికి వెళ్లి యజమానులను ప్రశ్నించగా.. తమ ఇంట్లోనూ బంగారం, నగదు మాయమైనట్లు వారు వెల్లడించినట్లు సమాచారం.

కల్పనతో కలిసి ఉన్న ఇద్దరు యువకుల పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య అనంతరం ముగ్గురు నిందితులు నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాజీ ఐపీఎస్ నివాసం, నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
మరోవైపు తనూజ అంత్యక్రియలు ఇవాళ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. ఆమె మృతదేహానికి డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు నివాళులర్పించారు.
