యంత్రాంగం హై అలర్ట్ !!

  • ప్రమాదకర స్థితిలో మున్నేరు ప్రవాహం…
  • లింగాల బ్రిడ్జి పై నుండి నీటి ప్రవాహం…
  • కీసరలోను ఉధృతంగా వరద నీటి పరవళ్ళు…
  • ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీరు….
  • ప్రజలకుపరివాహ ప్రాంత ప్రజలకు హెచ్చరికలు…
  • స్వయంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్ లక్ష్మీ శా, సి పి రాజశేఖర్ బాబు..

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : తుఫాన్‌ ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు నదిలో నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని లింగాల వద్ద ప్రస్తుతం నీటి స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అలాగే కంచికచర్ల మండలం కేసర వద్ద కూడా మున్నేరు ఉధృతి పెరుగుతోంది.

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటికి తోడు జిల్లాలో కురుస్తున్న వర్షాలు, వాగులు–వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ మున్నేరు నదిలో కలుస్తున్నాయి. దీంతో నదిలో నీటి మట్టం గంటల వ్యవధిలో పెరుగుతోంది.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం సాయంత్రం నుండి ప్రవాహం పెరుగుతుండడంతో కలెక్టర్ లక్ష్మీ షా, ఎస్పీ రాజశేఖర్ బాబు స్వయంగా పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ప్రస్తుతం లింగాల వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో ఆంధ్ర–తెలంగాణ మధ్య రవాణా పూర్తిగా నిలిచిపోయింది. కేసర ప్రాంతంలో కూడా నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు చర్యలు చేపట్టారు.

విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నీరు చేరే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు క్షణక్షణం పరిస్థితిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply