లగ్జరీ రూమ్స్‌లో జూదం.. 10 మంది అరెస్ట్

వరంగల్ క్రైమ్ (ఆంధ్రప్రభ): కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫాతిమానగర్‌లో ఉన్న వీఆర్‌ఎం ఆర్కేడ్ (ప్రీమియం అండ్ లగ్జరీ రూమ్స్)లో జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు వరంగల్ పోలీస్ టాస్క్‌ఫోర్స్ బృందం బుధవారం తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో జూదం ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుంది.

నిందితుల వద్ద నుంచి రూ.1,45,400 నగదు, 9 మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం, ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల కోసం కాజీపేట పోలీసులకు టాస్క్‌ఫోర్స్ అధికారులు అప్పగించారు.