పారదర్శక విక్రయాలే లక్ష్యం

నంద్యాల (నూనెపల్లె), ఆంధ్రప్రభ: జిల్లా రవాణా అధికారి శివారెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని పలు ద్విచక్ర వాహనాల షోరూమ్‌లలో మోటారు వాహనాల శాఖ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సౌజన్య హీరో, బజాజ్ షోరూమ్‌లలో జరుగుతున్న కార్యకలాపాలు, రికార్డులు, చట్టబద్ధ పత్రాలను పరిశీలించినట్లు ఎంవీఐ రవిశంకర్ నాయక్, ఏఎంవీఐ సుబ్బయ్య తెలిపారు.

ఈ సందర్భంగా షోరూమ్ యాజమాన్యం, సిబ్బందికి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పై అవగాహన కల్పించారు. వాహనం విక్రయించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వినియోగదారులకు ఫోన్ కాల్ చేసి, నిర్ణయించిన ధరకు అదనంగా లేదా అనవసరంగా ఎలాంటి రుసుములు వసూలు చేశారా అనే విషయంపై అభిప్రాయం సేకరిస్తారని వివరించారు. వాహన కొనుగోలుదారుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికారిక లేదా అదనపు ఛార్జీలు వసూలు చేయరాదని, ప్రతి లావాదేవీని పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి ప్రభుత్వ ఫీడ్‌బ్యాక్ కాల్‌లో సానుకూల స్పందన వచ్చేలా చర్యలు తీసుకోవాలని షోరూమ్ నిర్వాహకులకు సూచించారు. అదనపు రుసుములు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందితే సంబంధిత డీలర్‌పై మోటారు వాహనాల చట్టం, అమలులో ఉన్న నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.