సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించిన చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించాలని చౌటుప్పల్ సీఐ జి. మన్మథకుమార్ సూచించారు.
మంగళవారం చౌటుప్పల్ పట్టణంలోని బంగారిగడ్డ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆన్లైన్ మోసాలు, ఫేక్ కాల్స్, ఓటీపీ, యూపీఐ మోసాలు, ఫిషింగ్ లింకులు, సోషల్ మీడియా ట్రాప్లు, ఫేక్ జాబ్ ఆఫర్లు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు, డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న నేరాలపై వివరంగా అవగాహన కల్పించారు.
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులను నమ్మవద్దని సూచించారు. ఓటీపీలు, ఏటీఎం పిన్, సీవీవీ, పాస్వర్డ్లు, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు, ఫోటోలను అపరిచితులతో పంచుకోవద్దని హెచ్చరించారు.
సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
