గ్రామపంచాయతీ అనుమతులు, పన్నులు లేకుండానే పరిశ్రమ నిర్వహణ
- ఎంపీఎల్ లాజిస్టిక్ హబ్‌పై చర్యలు తీసుకోవాలని వినతి
చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామ శివారులో ఉన్న ఎంపీఎల్ లాజిస్టిక్ హబ్ పరిశ్రమ గ్రామపంచాయతీకి ఎలాంటి పన్నులు చెల్లించకుండా, ముందస్తు అనుమతులు లేకుండానే చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేయడంతో పాటు నల్గొండ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ, సదరు పరిశ్రమ గ్రామపంచాయతీ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు పొందలేదని, ఆస్తి పన్ను చెల్లింపులోనూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. స్థానిక అధికారులు ఈ వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల గ్రామపంచాయతీకి రావాల్సిన భారీ ఆదాయం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన ప్రధానంగా ఈ డిమాండ్లు చేశారు:
- ఎంపీఎల్ లాజిస్టిక్ హబ్‌పై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
- నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీకి చెల్లించాల్సిన పన్నులను వెంటనే వసూలు చేయాలి.
- వసూలు చేసిన నిధులను వట్టిమర్తి గ్రామాభివృద్ధి పనులకు వినియోగించేలా చర్యలు చేపట్టాలి.
స్థానిక స్వపరిపాలన వ్యవస్థను, గ్రామపంచాయతీ నిబంధనలను బేఖాతరు చేస్తున్న యాజమాన్యంపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే, గ్రామస్తులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మేడి హరికృష్ణ హెచ్చరించారు.
