భూ హక్కులకు పట్టాదారు పాస్ పుస్తకాలే భరోసా…
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
వేమిరెడ్డిపల్లి తండాలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచన
పొలాల్లోకి వెళ్లి మహిళా వ్యవసాయ కూలీలతో మమేకమైన ఎమ్మెల్యే
రైతులు, గ్రామస్థుల సమస్యలు తెలుసుకుని త్వరిత పరిష్కారానికి హామీ
వ్యవసాయాభివృద్ధి, గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి
( విస్సన్నపేట ఆంధ్రప్రభ ) : రైతుల భూ యాజమాన్య హక్కులను పరిరక్షించడంలో పట్టాదారు పాస్ పుస్తకాలు అత్యంత కీలకమని, ప్రతి రైతు వాటిని భద్రంగా ఉంచుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సూచించారు. విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి తండా గ్రామంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతులకు వ్యవసాయ రుణాలు, పంట పెట్టుబడి సహాయం, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు సకాలంలో అందేందుకు భూ రికార్డులు సక్రమంగా ఉండటం అవసరమన్నారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సాగునీటి వసతులు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైతు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముందు వేమిరెడ్డిపల్లి తండాలోని వ్యవసాయ పొలాలను సందర్శించిన ఎమ్మెల్యే, వరి నాట్లు వేస్తున్న మహిళా కూలీలతో కలిసి పొలంలోకి వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు.

వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు వ్యవసాయ పనుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. అనంతరం గ్రామస్థులు, రైతులు తమ ప్రాంత సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
