ఆధునిక రీ-సర్వేతో భూములకు శాశ్వత రక్షణ
సరిహద్దు వివాదాలకు చెక్
పాత సర్వే నంబర్లు యథాతథం..
జియో కోఆర్డినేట్లతో డిజిటల్ గుర్తింపు
బ్యాంకు రుణాలకు ఆటంకం లేదు..
రైతుల సహకారంతోనే విజయవంతం
డోర్నకల్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూభారతి రీ-సర్వే ప్రక్రియ రైతుల భూ హక్కులను మరింత పటిష్టం చేయడంతో పాటు, దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక అడుగుగా మారనుంది. అత్యాధునిక డిజిటల్ సాంకేతికతతో జరుగుతున్న ఈ సర్వేపై రైతుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని ములకలపల్లి, రావిగూడెం, బూరుగుపాడు, గుర్రాలకుంట గ్రామాల్లో తొలి విడత రీ-సర్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రీ-సర్వేతో పాత పట్టాదారు పాస్‌పుస్తకాలు, పహాణీలు రద్దు కావని, ఇప్పటివరకు ఉన్న సర్వే నంబర్లు కూడా అలాగే కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భూమి గుర్తింపును మరింత ఖచ్చితంగా చేయడానికి పాత సర్వే నంబర్లకు అనుసంధానంగా డిజిటల్ సబ్-డివిజన్ నంబర్లు, జియో కోఆర్డినేట్లు కేటాయిస్తారు. దీనివల్ల ప్రతి భూమికి శాశ్వత డిజిటల్ గుర్తింపు లభించి, భవిష్యత్తులో సరిహద్దు వివాదాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడనుంది.
వారసత్వ, సరిహద్దు సమస్యలకు చెక్
రీ-సర్వే పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న పాస్‌పుస్తకాలు, రెవెన్యూ రికార్డులే చెల్లుబాటులో ఉంటాయని, రైతులకు బ్యాంకు రుణాలు, ఇతర వ్యవసాయ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని అధికారులు తెలిపారు. ఒకే సర్వే నంబర్‌లో ఉన్న భాగస్వాముల భూములను క్షేత్రస్థాయిలో కొలిచి స్పష్టమైన రికార్డులు రూపొందించడంతో భవిష్యత్తులో వారసత్వ, సరిహద్దు సమస్యలు తగ్గనున్నాయి. భూ సర్వేను గ్రామసభలతో ప్రారంభించి ముందుగా గ్రామ సరిహద్దులు, ఆ తర్వాత ఆబాది భూములు, ప్రభుత్వ భూములు, చివరగా రైతుల పట్టా భూములను దశలవారీగా కొలుస్తారు. సర్వే అనంతరం ప్రతి భూమికి భూదార్ నంబర్, ల్యాండ్ పార్సెల్ మ్యాప్ (ఎల్‌పీఎం) జారీ చేసి డ్రాఫ్ట్ రికార్డులను ప్రకటిస్తారు. అభ్యంతరాలు ఉంటే 60 రోజుల లోపు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. అవసరమైతే పునఃసర్వే నిర్వహించి తుది రికార్డులు ఖరారు చేస్తారు.
వివాదాలకు పారదర్శక పరిష్కారం
భూమిపై వాస్తవ అనుభవం ఉన్న రైతులకు న్యాయం జరిగేలా ప్రత్యేక విచారణలు నిర్వహిస్తామని, సదా బైనామా కేసులు, పెండింగ్ భూ వివాదాలకు కూడా రీ-సర్వే ద్వారా పరిష్కారం చూపే అవకాశముందని రెవెన్యూ అధికారులు తెలిపారు. కోర్టుల స్టేలు ఉన్న భూములు మినహా మిగిలిన వివాదాలను పారదర్శకంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. డోర్నకల్ తహసీల్దార్ రాఘవరెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు మాట్లాడుతూ, భూభారతి రీ-సర్వే రైతుల భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమం కాదని, వారి హక్కులకు శాశ్వత రక్షణ కల్పించే సంస్కరణ అని స్పష్టం చేశారు. సర్వే బృందాలు గ్రామాలకు వచ్చినప్పుడు రైతులు తమ భూమి సరిహద్దులను చూపించి అవసరమైన పత్రాలు అందించి సహకరించాలని, అపోహలు, దళారుల ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
