నాణ్యతలేని బిర్యానీ తింటే తిప్పలు తప్పవు..

  • రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నంలో తక్కువ ధరకు విక్రయిస్తున్న బిర్యానీలపై రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రూ.100 బిర్యానీ పేరుతో నాణ్యతలేని ఆహారాన్ని విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న బిర్యానీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో అస్వస్థతకు గురైన ఎనిమిది మంది విద్యార్థులను జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడుతో కలిసి మంత్రి పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, అస్వస్థతకు అసలు కారణమేంటనే దానిపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థులకు ఇచ్చిన డీటీ (DT) ఇమ్యూనిటీ బూస్టర్ వ్యాక్సిన్ కారణమా, లేక ఫుడ్ పాయిజనింగ్ వల్ల అస్వస్థతకు గురయ్యారా అనే అంశాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి పూర్తి నివేదిక సమర్పించాలని వైద్యాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో బిర్యానీ సెంటర్లు విచ్చలవిడిగా పెరిగిపోయాయని అన్నారు. కేవలం తక్కువ ధర చూసి ఆహారం కొనుగోలు చేయకుండా, ఆహారం నాణ్యత, పరిశుభ్రత, తయారీ ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే తీసుకోవాలని ప్రజలకు సూచించారు. నాణ్యతలేని ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

జిల్లాలోని బిర్యానీ సెంటర్లు, ఫుడ్ అవుట్‌లెట్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.