హైదరాబాద్ – పాత లే ఔట్లను చెరిపేసి తమ ప్లాట్లతో పాటు.. ప్రజావసరాలకు ఉద్దేశించిన పార్కులు, రహదారులను కబ్జాచేసేస్తున్నారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
1980 – 1990 సంవత్సరాల కాలంలో వేసిన లే ఔట్లు మాయం చేసి.. భూమినంతా తమ ఆధీనంలోకి తీసుకున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణిలో మొత్తం 49 ఫిర్యాదులందాయి. ఇందులో ఎక్కువగా నగర శివార్లలోని లే ఔట్లకు సంబంధించినవి ఉన్నాయి.
భూములకు ధరలు పెరగడంతో.. గతంలో తమకు అమ్మినవారే కొన్ని చోట్ల కబ్జాలు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. పంచాయతీ లే ఔట్లను వ్యవసాయ భూములుగా మార్చేసి.. సాగు చేసుకుంటున్నారని ఫిర్యాదులందాయి. ఫిర్యాదుదారుల సమక్షంలోనే గూగుల్ మ్యాప్‌లు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులను పరిశీలించి.. సమగ్ర విచారణకు అధికారులను ఆదేశించడంతో ఫిర్యాదుదారులు ఊపిరి పీల్చుకున్నారు.
అక్కడికక్కడే అధికారులకు ఫిర్యాదులను అందజేసి.. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతామని కమిషనర్ హామీ ఇవ్వడంతో పలువురు సంతోషం వ్యక్తం చేశారు.