గోండు రాజుల కోటకు కొత్త రూపు
ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: ఐటీడీఏ పీవో మంద మకరందు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని గోండు రాజుల చారిత్రాత్మక కోటను ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరందు తెలిపారు.
మంగళవారం ఆయన గోండు రాజుల కోటను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజనుల నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా కోటను తీర్చిదిద్దుతామని తెలిపారు. గోండు రాజుల చరిత్ర, గిరిజనుల వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
గోండు రాజుల కోట గిరిజనుల గొప్ప చరిత్రకు, వారి వైభవానికి ప్రతీక అని అన్నారు. ప్రకృతి అందాలు, చారిత్రక ప్రాధాన్యత, గిరిజన సంప్రదాయాల సమ్మేళనంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
కోట పరిసరాల్లో పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు, సందర్శకులకు అవసరమైన మౌలిక వసతులు, నడక మార్గాలు, దిశా సూచిక బోర్డులు, విశ్రాంతి కేంద్రాలు, వీక్షణ స్థలాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
పర్యాటక రంగ అభివృద్ధితో స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, గిరిజన కళాకారులు, హస్తకళాకారులు తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. స్థానిక ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
గిరిజన వారసత్వాన్ని పరిరక్షిస్తూ ఆధునిక పర్యాటక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలో ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పీవో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఈఈ తానాజీ జాదవ్, అధికారులు, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
