మళ్లీ బ్రాండ్‌ ఏపీని తీసుకొస్తాం : చంద్రబాబు

  • మూడు రాజధానుల పేరుతో నవ్వులపాలయ్యాం.. అమరావతే ఏపీ భవిష్యత్‌: చంద్రబాబు
  • వైసీపీ పాలనలో రాష్ట్రానికి తీవ్ర నష్టం.. రెండేళ్లలో మార్పు దిశగా అడుగులు: సీఎం
  • అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ ప్రాజెక్ట్‌గా మారింది: చంద్రబాబు
  • వైసీపీ పాలనలో ఏపీ పేరు చెడిపోయింది..

ఆంధ్ర‌ప్ర‌భ‌, అమరావతి : గత ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మన రాజధాని ఏదని అడిగితే ‘మూడు రాజధానులు’ అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని, దీనిపై ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ పేరు చెబితేనే చిన్నచూపు చూసే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.

“పరిశ్రమలు రావాల్సిన రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ఏపీ బ్రాండ్‌ను తీవ్రంగా దెబ్బతీశారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రతిష్ఠను పెంచేందుకు కృషి చేస్తున్నాం” అని సీఎం పేర్కొన్నారు. 2019-24 మధ్య కాలంలో నాటి ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని చంద్రబాబు ఆరోపించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో ప్రజలు, అధికారులు, పోలీసులు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితులపై ప్రజల్లో వచ్చిన స్పందనే ఎన్నికల్లో నిశ్శబ్ధ విప్లవంగా మారిందని చెప్పారు. “57 శాతం ఓట్లతో ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు. 94 శాతం స్ట్రైక్‌ రేటుతో విజయం సాధించాం. ఎన్డీఏ కూటమిగా ప్రజల్లోకి వెళ్లి భారీ విజయాన్ని అందుకున్నాం” అని చంద్రబాబు తెలిపారు.

అమరావతిపై ప్రశంసలు వస్తున్నాయి…

గతంలో అమరావతిని కొందరు విమర్శించారని, కానీ ఇప్పుడు అదే అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ ప్రాజెక్ట్‌గా మారి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని సీఎం అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం విభజన తర్వాత ఎదురైన అతిపెద్ద సమస్యల్లో ఒకటని చెప్పారు. ఒకప్పుడు ఎక్కడి నుంచి పాలన సాగించాలో తెలియని పరిస్థితుల్లో బస్సులోనే ఉండి పరిపాలన ప్రారంభించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. విభజన వల్ల వచ్చిన నష్టాన్ని భరించామని, అయితే 2019-24 మధ్య జరిగిన పరిణామాలతో రాష్ట్రం మరింత వెనక్కి వెళ్లిందని ఆరోపించారు.

ఆర్థిక పరిస్థితిపై సీఎం వివరణ

విభజన తర్వాత వ్యవసాయ ఆధారిత రెవెన్యూ రాష్ట్రంగా ఏపీ ఏర్పడిందని చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.95,231గా ఉండగా, విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104కు పెరిగిందని, ఏపీ మాత్రం రూ.93,903 వద్ద ఉందని వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య తలసరి ఆదాయంలో రూ.30,201 వ్యత్యాసం ఏర్పడిందన్నారు. రాజధాని కోల్పోవడం, ఎక్కువ జనాభా, తక్కువ ఆదాయ వనరులతో రాష్ట్రం ఏర్పడటం దీనికి కారణమని పేర్కొన్నారు. అయినప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకురావడానికి కృషి చేశామని చెప్పారు. సీఏజీఆర్‌ వృద్ధి 30.5 శాతంగా నమోదవడం చారిత్రాత్మకమని, జీఎస్‌డీపీ వృద్ధి 13.5 శాతంగా ఉందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలతో ఏపీ, తెలంగాణ మధ్య వనరుల అంతరం 10 శాతం నుంచి 8 శాతానికి తగ్గించగలిగామని చంద్రబాబు చెప్పారు.

అభివృద్ధికే ప్రాధాన్యం..

రాష్ట్రానికి ఆదాయం రావాలంటే పెట్టుబడులు, అభివృద్ధి అవసరమని సీఎం స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో సాగునీరు, ఉక్కు పరిశ్రమ, కృత్రిమ మేధ, ఐటీ, ఔషధ రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, సంక్షేమ కార్యక్రమాలను నిర్ణయించిన విధంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. “సుస్థిర అభివృద్ధి కోసం కొత్త విధానాలను తీసుకొచ్చాం. ఆదాయం పెరిగితేనే సంక్షేమం, అభివృద్ధి రెండూ సాధ్యమవుతాయి” అని చంద్రబాబు అన్నారు.