ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరుపై పరిశీలన

జగిత్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు నిర్వహించే సాధారణ తనిఖీలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్‌లో ఉన్న ఈవీఎంల భద్రతా గోదాంను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ఇతర సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి నెల ఈవీఎం గోదాంను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నామని తెలిపారు. గోదాంలో భద్రతా ప్రమాణాలు ఎప్పటికప్పుడు పటిష్టంగా ఉండేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

గోదాం వద్ద ఎలాంటి లోపాలకు తావులేకుండా నిత్యం పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.