హుస్నాబాద్ (కరీంనగర్ జిల్లా), ఆంధ్రప్రభ : సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇప్పుడు కూడా ఇస్తామని, ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈసందర్భంగా కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు లక్షా 116 చొప్పున 60మందికి చెక్కులు అందజేశారు. అనంతరం సైదాపూర్‌లో విశాల సహకార పరపతి సంఘం సైదాపూర్ లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, విశాల సహకార పరపతి సంఘం మండల అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి, ఆర్డీవో రమేష్ పాల్గొన్నారు.
ఎవరు బయట అమ్మొద్దు..
సన్న వడ్లు ఎవరూ బయట అమ్మొద్దని మంత్రి పొన్నం అన్నారు. ఒకటో తేదీ పోతారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. ఎక్కడైనా అవసరముంటే అదనంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. గత పంటకు సంబంధించిన సన్న వడ్లకు బోనస్ పెండింగ్ బిల్లులు లేవని, ఒకవేళ ఎవరికైనా పేమెంట్ కాకపోతే జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవే వడ్లు సన్న బియ్యం రూపంలో మనకు వస్తున్నాయని చెప్పారు. దేశంలోనే మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కి గ్యాస్ అందిస్తున్నామన్నారు. రైతులకు రుణమాఫీ పూర్తి చేశామన్నారు. 168 కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశామన్నారు. ధాన్యం కొనుగోలులో ఎక్కడా అదనపు తూకం ఉండదని స్పష్టం చేశారు. రైతులకు ఏ కష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సన్న బియ్యం పంపిణీ అద్భుతమైన పథకం..
సన్న బియ్యం పంపిణీ అద్భుతమైన పథకమని మంత్రి పొన్నం అన్నారు. తమ పైసలతో అంటున్న కేంద్ర ప్రభుత్వం మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గురుకుల పిల్లలకు మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచినట్లు చెప్పారు. నీళ్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఒకవేళ నీటి కొరత ఉంటే చెప్పాలన్నారు.
ధరణి స్థానంలో భూ భారతి చట్టం..
ధరణి స్థానంలో భూభారతి చట్టం తీసుకువచ్చామని మంత్రి పొన్నం తెలిపారు. రెవెన్యూ పరమైన భూపంచాయితీ ఉండదని, భూమి అంటే ఆత్మగౌరవం అలాంటి పంచాయితీలు ఇక ఉండవని చెప్పారు. అలాగే ఎస్సీ వర్గీకరణపై చారిత్రక నిర్ణయం తీసుకున్నామని, దేశంలోనే మొదటిసారి చట్టం తెచ్చామని చెప్పారు. బీసీ కులగణన చేశామని, రిజర్వేషన్ల పెంపు చట్టం తెచ్చామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో రాజకీయ జోక్యం ఉండదన్నారు.