జనగణన-2027కు నోటిఫికేషన్..
- 1931 తర్వాత తొలిసారి కుల గణన
- ఆగస్టు 17 నుంచి జనగణన రెండో దశ..
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం జనగణన-2027లో భాగంగా రెండో దశ జనాభా గణన (పాప్యులేషన్ ఎన్యూమరేషన్) నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. 1931 తర్వాత తొలిసారిగా ఈ జనగణనలో కుల వివరాలను నమోదు చేయనున్నారు. లడఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని మంచు ప్రభావిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను ముందుగా చేపట్టనున్నారు.
కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఆగస్టు 17 నుంచి 31 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జనాభా గణన నిర్వహిస్తారు. అక్టోబర్ 1 నుంచి 5 వరకు రివిజన్ రౌండ్ చేపట్టనుండగా, 2026 అక్టోబర్ 1 అర్థరాత్రిని ఈ ప్రాంతాలకు జనగణన రిఫరెన్స్ తేదీగా నిర్ణయించారు.
ప్రజలు తెలిపిన వివరాల ఆధారంగానే కుల నమోదు…
జనగణనలో కుల వివరాలను వ్యక్తులు స్వయంగా ప్రకటించిన విధంగానే నమోదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల అధికారిక జాబితా ఆధారంగా నమోదు జరుగుతుంది. ఇతర వర్గాలకు ప్రత్యేక కుల నమోదు విభాగం ఉంటుంది. కుల ధ్రువీకరణ పత్రం లేదా ఇతర ఆధారాలను చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఈసారి జనగణనలో తొలిసారిగా తల్లిదండ్రుల పుట్టిన తేదీ, జన్మస్థలం వివరాలను కూడా సేకరించనున్నారు. పౌరసత్వానికి సంబంధించిన గణాంక విశ్లేషణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. వివరాలు తెలిసిన మేరకే నమోదు చేస్తారు. ఖచ్చితమైన తేదీ తెలియకపోతే కేవలం సంవత్సరం మాత్రమే నమోదు చేసే అవకాశం ఉంటుంది.
జనగణనలో ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేయడం లేదని, స్వచ్ఛందంగా మాత్రమే నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. పాస్‌పోర్టు ఉన్నవారి నుంచి మాత్రమే ఆ వివరాలను సేకరిస్తారు. వ్యక్తిగత సమాచారం చట్టప్రకారం గోప్యంగా ఉంటుందని, ప్రభుత్వ ప్రయోజనాలు లేదా న్యాయపరమైన ఆధారంగా వినియోగించరాదని స్పష్టం చేశారు.
డిజిటల్ సాంకేతికతతో కులాల వర్గీకరణ..
2011 సామాజిక-ఆర్థిక కుల గణనలో వేల సంఖ్యలో కులాల వివరాలు నమోదవడంతో వర్గీకరణలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఈసారి డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో ఆ సమస్యలను అధిగమించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానాన్ని కూడా మరింత సులభతరం చేశారు. కనీస వివరాలు నమోదు చేసినా ఫారమ్ సమర్పించే అవకాశం ఉండటంతో గణన సిబ్బందిపై పని భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
