RR vs GT | క్వాలిఫైయర్ 2లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్!…

RR vs GT | క్వాలిఫైయర్ 2లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్!

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్ : న్యూ చండీగఢ్ : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. నేడు జరుగుతున్న అత్యంత కీలకమైన నాకౌట్ పోరులో గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.

నేడు ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 పోరులో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ వేసే సమయంలో స్వల్ప గందరగోళం తలెత్తడంతో, నిబంధనల ప్రకారం మరోసారి టాస్ వేయాల్సి వచ్చింది. చివరికి రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు మొగ్గు చూపారు.

జట్టు మార్పుల విషయానికి వస్తే.. గుజరాత్ టైటాన్స్ జట్టులో ఒక మార్పు జరిగింది. కుల్వంత్ ఖేజ్రోలియా స్థానంలో స్పిన్నర్ రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఎలాంటి మార్పులు లేకుండా ‘అన్‌చేంజ్డ్’ జట్టుతో బరిలోకి దిగుతోంది.

గుజరాత్ టైటాన్స్ : శుభమన్ గిల్ (c), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (WK), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్

రాజస్థాన్ రాయల్స్ : వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (WK), రియాన్ పరాగ్ (c), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ పుంజా

ఫైన‌ల్ టికెట్ కోసం పోరు..

ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు, మే 31న అహ్మదాబాద్‌లో జరగనున్న ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో తలపడనుంది. ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్న ఆర్సీబీని ఢీకొట్టే ఆఖరి బెర్తు కోసం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.

ప్రస్తుత సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు, క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైన గుజరాత్ టైటాన్స్, ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్స్‌కు చేరుకోవాలని పట్టుదలగా ఉంది.

సూర్యవంశీని అడ్డుకునేందుకు ‘రషీద్ ఖాన్’ అస్త్రం!

ఈ మ్యాచ్‌లో అందరి కళ్ళు రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌పై కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి చరిత్ర సృష్టించిన సూర్యవంశీ.. ఈ సీజన్‌లో ఏకంగా 65 సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు.

ఈ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సూర్యవంశీని అడ్డుకోవడమే గుజరాత్ టైటాన్స్ ముందున్న అతిపెద్ద సవాలు. ఇందుకోసం గుజరాత్ తమ ప్రధాన స్పిన్ అస్త్రం రషీద్ ఖాన్ పైనే ఆశలు పెట్టుకుంది. పవర్‌ప్లేలో సూర్యవంశీ విధ్వంసానికి రషీద్ బ్రేకులు వేయగలడా అనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply