AP | బీఎల్ఎం ట్రావెల్ బస్సు పల్టీ ..

25మంది ప్రయాణికులకు గాయాలు -ఏడుగురి పరిస్థితి విషమం
చెన్నై నుంచి వైజాగ్ వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు


AP | ఉంగుటూరు – ఆంధ్రప్రభ : ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి వైజాగ్‌కు 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న బిఎల్ఎం ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో 18 మందికి స్వల్ప గాయాలు కాగా, 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం విజయవాడ పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద సమయంలో ప్రయాణికులు అరుపులు, కేకలతో పరుగులు తీశారు. బస్సు వేగంగా ఉండటంతోనే డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న ఉంగుటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యమా లేక మరేదైనా సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 7 మందిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.