ఆంధ్రప్రభ ఎఫెక్ట్.. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై వేటు

  • వరుస కథనాలతో స్పందించిన వైద్యారోగ్యశాఖ..
  • డిప్యూటీ సూపరింటెండెంట్‌కు పూర్తి బాధ్యతలు

భూపాలపల్లి, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా జనరల్ ఆస్పత్రిలో నెలకొన్న అవ్యవస్థలు, రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వైద్య సేవల్లో నిర్లక్ష్యం, ఆక్సిజన్ ప్లాంట్ నిర్వహణలో లోపాలు, తాగునీరు–పారిశుద్ధ్య సమస్యలు, సిబ్బంది పర్యవేక్షణలో వైఫల్యాలపై ఆంధ్రప్రభ వరుసగా ప్రచురించిన కథనాలు ఎట్టకేలకు ఫలితాన్నిచ్చాయి. ఈ కథనాలపై స్పందించిన వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ (ఎఫ్‌ఏసీ)ను బాధ్యతల నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

జిల్లా ఆస్పత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను “జిల్లా ఆస్పత్రిలో దారుణం”, “కలెక్టర్ పట్టించుకోవాలి”, “రోగుల ప్రాణాలతో చెలగాటం” వంటి శీర్షికలతో ఆంధ్రప్రభ వరుస కథనాల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చింది. ఆస్పత్రిలో తాగునీటి కొరత, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు, పనిచేయని ఆక్సిజన్ ప్లాంట్, రోగులకు తీవ్ర ఇబ్బందులు, పరిపాలనా లోపాల వంటి అంశాలు రాష్ట్రస్థాయిలో చర్చకు దారితీశాయి.

ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టినట్లు సమాచారం. విచారణలో పరిపాలనా నిర్లక్ష్యం, పర్యవేక్షణలో వైఫల్యాలు ఉన్నట్లు తేలడంతో సూపరింటెండెంట్ (ఎఫ్‌ఏసీ)ను బాధ్యతల నుంచి తప్పిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.

అదే సమయంలో జిల్లా ఆస్పత్రి పరిపాలనను గాడిలో పెట్టేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆదేశాల మేరకు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నంకు పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.

జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను నిరంతరం ప్రజల దృష్టికి తీసుకొచ్చిన ఆంధ్రప్రభ కథనాల ఫలితంగానే ఈ చర్యలు జరిగాయని స్థానిక ప్రజలు, రోగుల బంధువులు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా ఆస్పత్రిలో పరిస్థితులు మెరుగుపడి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.