వైభవంగా ఆషాఢ సారె ఉత్సవాలు
- భారీగా తరలివస్తున్న భక్తులు..
- 20వ రోజు ఇంద్రకీలాద్రికి భారీగా తరలివచ్చిన సారె బృందాలు
- 48 బృందాల నుంచి 18,432 మంది భక్తుల రాక
- పసుపు, కుంకుమలు, చీరలు, గాజులతో అమ్మవారికి సారె సమర్పణ
- సారె బృందాలకు దేవస్థానం ఉచిత దర్శనం, ఆశీర్వచన ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించే మహిళా భక్తులు ఆషాఢ సారె ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొంటున్నారు. ఆషాఢ సారె ఉత్సవాల 20వ రోజైన సోమవారం అమ్మవారి సన్నిధిలో మహిళల రద్దీ విశేషంగా పెరిగింది. పసుపు, కుంకుమలు, గాజులు, చీరలు, సారెలతో అలంకరించిన సారె కానుకలను సమర్పించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. మొత్తం 48 సారె బృందాలు అమ్మవారిని దర్శించుకోగా, ఆయా బృందాల ద్వారా 18,432 మంది భక్తులు సారె సమర్పణలో పాల్గొన్నారు.
సారె సమర్పణకు వచ్చిన మహిళా భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఉచిత దర్శనం కల్పించడంతో పాటు వేదపండితుల ఆశీర్వచనాలు అందేలా చర్యలు చేపట్టింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునేలా ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆషాఢ మాసంలో ప్రతి ఏడాది నిర్వహించే సారె ఉత్సవాలు భక్తి వైభవాన్ని చాటుతున్నాయని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.


